నా మెడ వొంపున వెచ్చగా తాకే నీ ఊపిరి
నా నడుము వొంపులో నాట్యం చేసే నీ చేతివేళ్లు
నన్ను నీలో పొదువుకుంటూ అధికారంగా నీ చేతులు
నా అణువణువు నీలో కలిసిన వేళ
అరమోడ్పులైన నా కన్నుల జారి
ఎర్రబడ్డ నా చెక్కిలిని ముద్దాడి
అదిమిపెట్టిన నా పెదవి అంచున
గర్వంగా కరిగిందొక కన్నీటి చుక్క !!


మరు జన్మలో నీ గుండె నై పుడతా!
నీతో పుట్టి నీ తోనే వెళ్ళిపోతా !!
నీ ఉనికి నవుతా, నీ మనసు నాలో దాచుకుంటా!
నీకు జీవాన్నై, ధైర్యాన్నై;
ప్రతి క్షణం నా ప్రేమని నీ గుండె చప్పుళ్ళలో చెపుతుంటా!

అప్పటి వరకు, నీలో ఐక్యమైపోయే ఆ క్షణం వరకు,
నిన్ను చూస్తూ, నిన్ను ప్రేమిస్తూ,
ఆరాధించే నీ పిచ్చి పెళ్ళాం.


నువ్వు లేనప్పుడు నేను నేనుగా ఉన్నాను..
నువ్వు కలిసాక నేను నీవుగా ఉన్నాను..
నువ్వు వెళ్ళాక ఏమైంది..,
నా ఉనికినే కోల్పోయాను....


మనసులో కోటివీణలు ఘోషిస్తున్నా
మనసు మాట్లాడనీయదు
కనులు జలపాతాలవుతున్నా
కల నుంచి ఇల చేరాలనిపించదు
గుండెలో చితి మంటలు చెలరేగినా
బిడియం నిను చేరనీయదు


నా జీవితం లో క్షణ క్షణాన్ని పేర్చాలనుంది,
నీతో గడపడానికి !
నా మనసులో భావాలన్నీ కన్నుల్లో చేర్చాలనుంది,
నీతో పంచుకోవడానికి !
ఏమో ఎవరికి తెలుసు? నిన్ను చూసిన క్షణం
గుండె గొంతుకలో అడ్డుపడి, వేవేల ఊసులు
కన్నీళ్ళై కట్టలు తెన్చుకున్టాయేమో??